Andhra Pradesh
మోడీ సభకు ఆంధ్రా వర్శిటీ నిరాకరణ
విశాఖపట్టణం, ఫిబ్రవరి 25 (LOCAL NEWS INDIA )
ప్రధాని మోడీ సభకి ఆంధ్ర యూనివర్సిటీ మైదానం ఇవ్వడానికి అధికారులు నిరాకరించారు. మోడీ మార్చి 1న విశాఖ వస్తున్నారు. ఇక్కడ బహిరంగ నిర్వహించాలని భావించారు. అందుకు బీజేపీ నాయకులు అనుమతి కోరగా వర్సిటీ అధికారులు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. స్వయాన గవర్నరు నరసింహన్ జోక్యం చేసుకున్నా అనుమతి లభించలేదు. ఇది పెద్ద రాజకీయ వివాదానికి దారితీసింది. విశాఖపట్నంలో మార్చి ఒకటో తేదీన నరేంద్రమోడీ నిర్వహించతలపెట్టిన బహిరంగ సభకి ఏయూ మైదానాన్ని కేటాయించకపోవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. దీనిపై గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ముఖ్య కార్యదర్శి ఏయూ వైస్ చాన్సలర్‌ను వివరణ కోరారు. సభకి ఎందుకు అనుమతివ్వడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత విద్యామండలి ముఖ్యకార్యదర్శి సైతం వర్సిటీ ఉన్నతాధికారులను వివరణ అడిగారు.ప్రధాని సభ విశాఖలో నిర్వహించాలనుకున్న వెంటనే స్థానిక బీజేపీ నేతలు ఏయూ ఉన్నతాధికారుల అనుమతి కోరడం, వారు నిరాకరించడం జరిగింది. ఆంధ్రవిశ్వవిద్యాలయంలో రాజకీయ పార్టీల కార్యక్రమాలకు, సభలకు అనుమతి ఇవ్వరాదని 2015లో రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసిందని, ఆ కారణంగానే ప్రధాని సభకి అనుమతి ఇవ్వలేదని ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు తెలిపారు. తమపై రాజకీయ ఒత్తిళ్లు లేవని ఆయన చెప్పారు. గతంలో సెలవుల కారణంగానే టీడీపీ సభలకి, వేడుకలకి అనుమతి ఇచ్చామని, అప్పుడు కూడా రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధికారుల సూచనలు పాటించామన్నారు. ప్రభుత్వ కార్యక్రమానికైతే ఇప్పుడు కూడా ఇచ్చేవారమన్నారు.గవర్నర్ ముఖ్య కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత విద్యామండలి ముఖ్య కార్యదర్శి వివరణ కోరిన మాట వాస్తవమేనని చెప్పారు. అయితే దీనిపై బీజేపీ నేతలు మండిపడ్డారు. ఏయూ మైదానాన్ని టీడీపీ కార్యక్రమాలకు, ముఖ్యమంత్రి బహిరంగ సభలకు ఇష్టారాజ్యంగా వాడుకున్నారని, స్వయానా ప్రధానమంత్రి సభకి ఎందుకు అనుమతించడం లేదని మండిపడ్డారు. ఇది అత్యంత దుర్మార్గమని ఆగ్రహం వెలిబుచ్చారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిడి కారణంగానే ప్రధాని సభకి వర్సిటీ అధికారులు అనుమతి ఇవ్వడం లేదని బీజేపీ నాయకులు ఆరోపించారు. అయితే ఆంధ్ర యూనివర్సిటీ అధికారులు మాత్రం, ప్రభుత్వ కార్యక్రమాలకు తప్ప, రాజకీయ కార్యక్రమాలకు ఇవ్వకూడదు అని 2015లోనే నిర్ణయం తీసుకున్నామని, ప్రధాని సభ రాజకీయ సమావేశం అంటున్నారు కాబట్టి, యూనివర్సిటీ నిబంధనలు ప్రకారం ఇవ్వటం లేదని చెప్తున్నారు.