Telangana
నామినేటెడ్ సభ్యుడిగా స్టీఫెన్ సన్
హైదరాబాద్,జనవరి 7, (లోకల్ న్యూస్)
ప్రగతి భవన్లో తెలంగాణ మంత్రివర్గ సమావేశం ముగిసింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఈ భేటీలో హోంమంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ కే జోషి, ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. శాసనసభల నామినేటెడ్ సభ్యుడి నియామకానికి తీర్మానం చేశారు. ఆంగ్లో ఇండియన్ సభ్యుడిగా ఎల్వీస్ స్టీఫెన్ సన్ను నియమించాలని కేబినెట్ నిర్ణయించింది. స్టీఫెన్ సన్ను నియమిస్తూ మంత్రివర్గం గవర్నర్కు ప్రతిపాదనలు పంపింది. సికింద్రాబాద్ కు చెందిన స్టీఫెన్ సన్ ఓటుకు నోటు కేసు ద్వారా వార్తల్లోకి ఎక్కారు. అయనకిది రెండవసారి దక్కిన అవకాశం. ఎమ్మెల్యేలతో పాటు నామినేటెడ్ సభ్యుడి ప్రమాణ స్వీకారం జరపాలని నిర్ణయించారు. సభ్యులకు రాజ్యాంగం, అసెంబ్లీ నిబంధనలు, నిబంధన పుస్తకాలు, ఇతర బుక్లెట్లు ఇవ్వాలని ఈ భేటీలో నిర్ణయించారు. అలాగే, ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించినందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్కుమార్కు, ప్రభుత్వ యంత్రంగానికి మంత్రి వర్గం అభినందనలు తెలిపింది.