Andhra Pradesh
ప్రజల్లో పెరిగిన చైతన్యం
అమరావతి,జనవరి 3, (లోకల్ న్యూస్)
ప్రజలకు ఓపికగా సమాధానం చెప్పాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. ‘జన్మభూమి-మాఊరు’పై చంద్రబాబు గురువారం ఉదయం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లాల కలెక్టర్లు,నోడల్ అధికారులు,ప్రజా ప్రతినిధులు పాల్గోన్నారు. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ జన్మభూమిలో ప్రజల భాగస్వామ్యం అధికంగా ఉందన్నారు. ప్రజల్లో పెరిగిన చైతన్యానికి అదే నిదర్శనమన్నారు. ఫిర్యాదుదారుల్లో బాధ ఉంటుందని, దాన్ని మనం అర్థం చేసుకోవాలన్నారు. సత్వరమే పరిష్కరిస్తే ప్రజల్లో సంతృప్తి మరింత పెరుగుతుందన్నారు. ప్రజల బాధలు విని వాటిని పరిష్కరిస్తే ఆ సంతృప్తి వేరుగా ఉంటుందన్నారు. ఈ జన్మభూమి తొలిరోజే అద్భుత స్పందన వచ్చింది. గతంలో చివరి రోజు కూడా ఇంత స్పందన రాలేదు. ఈ జన్మభూమిలో ప్రజల భాగస్వామ్యం అధికంగా ఉంది. ప్రజల్లో పెరిగిన చైతన్యానికి అదే నిదర్శనం. తొలిరోజు 19,36,697మంది పాల్గొన్నారు. 2,65,704మంది విద్యార్ధులు పాల్గొన్నారు. 38వేల మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యకలాపాల్లో 85వేల మంది పాల్గొన్నారు. *జన్మభూమిపై ప్రజల్లో 78% సంతృప్తి(ఓవరాల్ శాటిస్ ఫాక్షన్) వచ్చిందని అయన సంతోషం వ్యక్తం చేసారు. గ్రామసభలో చర్చ అర్ధం అయ్యిందని 89% మంది, ఈ చర్చ గ్రామాభివృద్దికి దోహదపడుతుందని 85%మంది తెలిపారు. ఆటల పోటీలు నిర్వహించారని 60% మంది,సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారని 62%మంది, వైద్య శిబిరాలు జరిగాయని 73% మంది తెలిపారు. ప్రజలకు ఓపికగా సమాధానం చెప్పాలి ప్రజల్లో నమ్మకం కలిగించాలని సూచించారు. రాష్ట్రాన్ని మన కష్టంతో ఒక స్థాయికి తెచ్చాం. తరువాత దశకు తీసుకెళ్లాలి. ఫిర్యాదుల సంఖ్య గణనీయంగా తగ్గింది. నాలుగున్నరేళ్లలో చేసిన పనులే అందుకు నిదర్శనం. పెద్దఎత్తున అభివృద్ధి,సంక్షేమం చేపట్టాం. కేంద్రం జాప్యం వల్లే ఉపాధి హామీ నిధుల విడుదలలో జాప్యం. ఆ విషయం గ్రామసభల్లో వివరించాలని అన్నారు. చుక్కల భూముల సమస్యలు సమర్ధంగా పరిష్కరించాలి. రెవిన్యూ సంస్కరణల గురించి వివరించాలి. భూ వివాదాలు సత్వరమే పరిష్కరించాలి. జన్మభూమి తొలిరోజు 18,527 ఫిర్యాదులు వచ్చాయి. పౌర సరఫరాలపై 4వేలు, రెవిన్యూలో 3వేల ఫిర్యాదులు వచ్చాయి. సాధ్యమైనన్ని ఫిర్యాదులు ఈ 10రోజుల్లోనే పరిష్కరించాలి. సమస్యల పరిష్కారానికి గొప్ప వేదిక జన్మభూమి. ఇందులో ప్రభుత్వ యంత్రాంగానిదే కీలక భూమిక. ప్రజా దీవెన’లు పొందే అద్భుత అవకాశం జన్మభూమని అన్నారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలి. అర్ధవంతమైన భాగస్వామ్యం ఉండాలి. చర్చలు అర్ధవంతంగా జరగాలి. గ్రామాలు,వార్డుల అభివృద్ధే మన లక్ష్యం. పేదల సంక్షేమమే ప్రభుత్వ సంకల్పమని అయన అన్నారు. తరువాత దశకు ప్రణాళికలు సిద్ధం చేయాలి. అనంతపురం కోమటికుంట బాయ్ కాట్ పై సీఎం స్పందించారు. కారణాలు అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి, గ్రామస్థుల సమస్య వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.