Andhra PradeshTelangana
తెలుగు రాష్ట్రాల మధ్య వార్… పేలుతున్న మాటల తూటాలు
హైద్రాబాద్, డిసెంబర్ 31, (లోకల్ న్యూస్)
ఏపీ పాలిటిక్స్ లో తెలంగాణ సిఎం కేసీఆర్ ఎన్నడూ వేలు పెట్టేందుకు ఆసక్తి చూపలేదు. కానీ మొన్నటి ఎన్నికల్లో ఎపి సిఎం చంద్రబాబు ఎప్పుడైతే తెలంగాణ లో కూటమి కట్టి గోదాలోకి దిగారో అప్పటి నుంచి సందర్భం వచ్చినప్పుడల్లా ఎపి రాజకీయాల్లో కెసిఆర్ చురుగ్గా స్పందించడం మొదలు పెట్టారు.
అది ఏ స్థాయిలో అంటే ఎపి లోని ఇతర రాజకీయ పక్షాలకన్నా ఇప్పుడు కెసిఆర్ ప్రధాన పక్షంగా చంద్రబాబు అండ్ టీం భావించే స్థాయిలో. దాంతో టిడిపి కి నిత్యం తెలంగాణ నేతల నుంచి తలపోట్లు వచ్చే ఎన్నికల వరకు తప్పేలా లేవు. సొంత రాష్ట్రంలో విపక్షంపై దాడి ప్రతిదాడి సమర్ధవంతంగా చేస్తున్నప్పటికీ పక్క రాష్ట్ర అధినేత తిట్ల దండకం వినలేక టిడిపి నేతలు చెవులు మూసుకునే లా పరిస్థితి ఏర్పడింది. ఇది తమ అధినేత స్వయం కృతమే అని ఇప్పుడు టిడిపి వర్గాలే మదన పడుతున్నాయి.
తెలంగాణ అధినేత కెసిఆర్ గట్టున వున్నారు. ఆయనకు ఎన్నికలు పూర్తి అయి అఖండ విజయం దక్కి తిరిగి పీఠం ఎక్కేశారు. అదే చంద్రబాబు పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా వుంది. ఆయన వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను ఒకేసారి ఎదుర్కోవాలి. ఇందులో ఏ మాత్రం తేడా కొట్టినా అటు జాతీయ స్థాయిలో ఇటు రాష్ట్రస్థాయిలో అభాసుపాలౌతారు. అసలే ప్రభుత్వ వ్యతిరేక పవనాలు ఎదుర్కోవాలి. మరోపక్క విపక్షం గత ఎన్నికల్లో అతి స్వల్ప తేడాతో మాత్రమే అధికారం కోల్పోయింది. ఈసారి ఎన్నికల్లో గతంలో సహకరించిన జనసేన, బిజెపి లేవు.కలిసొస్తుందో రాదో తెలియని కాంగ్రెస్ చెయ్యి పట్టుకుని నడవాలిసిన దుస్థితి. ఇన్ని బాధలు ఉండగా ఎపి ప్రయోజనాల సంగతి పక్కన పెట్టి తెలంగాణ ఎన్నికల్లో చెయ్యి పెట్టి కాల్చుకుని లేని శత్రువును టీఆర్ఎస్ రూపంలో కొనితెచ్చుకున్నారు చంద్రబాబు. దాంతో ఆయన ముప్పేట దాడికి గురౌతున్నారు. విఫల ముఖ్యమంత్రిగా అసమర్దుడిగా, దద్దమ్మ, లఫంగి వంటి తీవ్ర పరుష పదజాలంతో కెసిఆర్ తో అవమానాలు పొందడానికి సిద్ధమయ్యారు..చంద్రబాబుపై.. జగన్ తన మార్క్ చూపించలేక పోతున్నారని భావించాడా? లేక వైసీపీ నేతలు టీడీపీపై సరిగ్గా పోరాటం చేయట్లేదని డిసైడ్ చేశారో తెలియదు కానీ, ఏపీలో ప్రతిపక్షం ఫెయిలందని మాత్రం తేల్చేశారు కేసీఆర్. అంతేకాదు ప్రతిపక్షం ఫెయిలయిందని, తాము రంగంలోకి దిగుతున్నామని కూడా ప్రకటించారాయన. దీంతో ఆయన మాట్లాడిన ఈ మాటలు కాస్త రాజకీయ వర్గాలను ఆలోచనలో పడేశాయి. దీనికి తోడు మొన్న కేసీఆర్ వైజాగ్ వెళ్ళినపుడు అక్కడి ప్రజలు ఆయనను రిసీవ్ చేసుకున్న తీరు కూడా ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారాయి. కేసీఆర్.. జగన్‌ని, వైసీపీని ఇంతలా దిగదొక్కుతూ మాట్లాడినా కూడా వైసీపీ నేతలు కుయ్యిమనక పోవటం ఇక్కడ గమనించాల్సిన విషయం. ప్రతిపక్షం ఫెయిలయిందంటే.. అది ఒక్క జగన్ మాత్రమే కాదు కదా.. వైసీపీ నేతలందరూ ఫెయిలయినట్లే. అయినా సరే.. కేసీఆర్‌పై విమర్శలు చేయడానికి వారు సిద్ధపడటం లేదంటే వైసీపీ వర్గాలకు కేసీఆర్ అంతర్గతంగా సహాయసహకారాలు అందిస్తున్నాడా? లేక కేసీఆర్ విమర్శలు వైసీపీకి ప్లస్ అవుతాయని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారా? అనే కోణంలో ఏపీలో చర్చలు రాజుకుంటున్నాయి.ఇలా కేసీఆర్‌కు.. వైసీపీ ఇస్తున్న అవుట్ రైట్ సపోర్ట్‌తో.. ఏపీలో టీఆర్ఎస్సే ప్రధాన ప్రతిపక్షంగా ఎదగనుందని ప్రజలకు అనిపించినా తప్పు లేదు. తాజాగా జరుగుతున్న ఈ పరిణామాలు చూస్తుంటే ఎక్కడో తేడా కొడుతోంది. తాము ప్రతిపక్షంగా విఫలమైనా.. కేసీఆర్ రంగంలోకి దిగినా, తమనే గెలిపిస్తాడని.. ఆయన గానీ, లేకపోతే ఆయన పార్టీ గానీ వచ్చి.. ఏపీలో అధికారం చేపట్టే ఛాన్స్ ఎలాగూ లేదు కదా! అనే ధీమా వైసీపీ నేతల్లో కనిపిస్తున్నట్లుగా ఉంది.ఏపీలో ప్రతిపక్షం ఫెయిలయ్యిందంటూ కొత్తగా ఇప్పుడు కేసీఆర్ సర్టిఫికెట్ జారీ చేశారు కానీ అసెంబ్లీని బహిష్కరించినప్పుడు.. ఎంపీలు పార్లమెంట్ నుంచి పారిపోయినప్పుడే.. జగన్ ప్రతిపక్షంగా ఫెయిలయ్యారని ఏపీ ప్రజలు నిర్ణయించుకున్నారు. ఈ కోణంలోనే కాబోలు కేసీఆర్ కూడా ఏపీలో ప్రతిపక్షానికి చేత కావడం లేదని తేల్చేశారు. మొత్తానికి ఏపీలో ఇక నుంచి.. ప్రతిపక్షం టీఆర్ఎస్సేనని.. కేసీఆర్ మాటల ద్వారా, ఆయన మాటలకు వైసీపీ నేతలిస్తున్న మద్దతు ద్వారా తేలిపోయిందనే చెప్పుకోవచ్చు. అయితే ఈ మద్దతు ద్వారా వైసీపీకి స్వలాభం లేదని మాత్రం చెప్పలేం! దాంతో భవిష్యత్తు రాజకీయాల్లో టిడిపి వర్గాలు టి నేతల నుంచి మరిన్ని అవమానకర విమర్శలు ఆరోపణలు ఎదుర్కోక తప్పేలా లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు