Telangana

పల్లె పోరుకు టెక్నాలజీ సహకారం

ఆదిలాబాద్‌, డిసెంబర్ 28, 2018 ( లోకల్ న్యూస్‌)
పంచాయతీ ఎన్నికల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వాడేందుకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటోంది. ఎన్నికల్లో పారదర్శకత కోసం ‘టీఈ-పాల్‌’ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సైట్ ద్వారా ఎన్నికలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని అందరూ తెలుసుకునేలా అవకాశం కల్పిస్తోంది. మొత్తంగా అన్ని వివరాలు ఆన్‌లైన్‌లో ఉంచాలని అధికారులు భావిస్తున్నారు. ఓటరు స్లిప్‌ నుంచి నామినేషన్ల వివరాలనూ ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు.
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్తే పంచాయతీ ఎన్నికల సమస్త సమాచారం తెలుసుకునేలా సైట్‌ను రూపొందించారు. ఎన్నికల సమాచారం మొత్తం ఆన్‌లైన్ చేయడం ద్వారా వివాదాలకు ఆస్కారం ఉండదని అందరూ వివరాలు తెలుసుకునే ఛాన్స్ ఉంటుందని అధికారులు అంటున్నారు. ఈ సైట్ ప్రజలు, నేతలకే కాక అధికార వర్గాలకూ ఉపయుక్తంగానే ఉంటుందని చెప్తున్నారు. ఇదిలాఉంటే ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది కోసం ప్రత్యేకంగా ఒక పోర్టల్‌ను రూపొందించారు. పంచాయతీ ఎన్నికల్లో అధికారులు పాటించాల్సిన విధానాలను ఇందులో పేర్కొన్నారు. అభ్యర్థుల ఎన్నికల వ్యయం పర్యవేక్షణకూ సూచనలు ఇచ్చారు. అంతేకాక ఎన్నికలపై రూపొందించిన రిపోర్టును ఎలా సమర్పించాలనే అంశాలనూ నమోదు చేశారు.
పంచాయతీలో ఎన్నికలకు సంబంధించి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు తొలిసారిగా వెబ్‌పోర్టల్‌ రూపకల్పన చేశారు. ఎన్నికల సమాచారం ఆన్‌లైన్‌లో పొందుపరిచే అవకాశం ఉండడంతో వివిధ స్థాయిల్లో పనులు వేగంగా సాగుతున్నాయి.  పనిభారం తగ్గిందని కొందరు అధికారులు చెప్తున్నారు. సమయానికి పనులు పూర్తి చేయగలుగుతున్నామని అంటున్నారు. మొత్తంగా సాంకేతికతతో పని భారం తగ్గిందని హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఇదిలాఉంటే ఆన్‌లైన్‌ ద్వారానే పలు పనులు సాగేలా చర్యలు తీసుకున్నారు.
ఎన్నికల్లో పోటీ చేసే సర్పంచి, వార్డు సభ్యులు నేరుగా ఆన్‌లైన్‌ విధానం ద్వారా నామినేషన్‌ దాఖలు చేసే అవకాశం ఉంది. అంతేకాక ఓటరు జాబితాను టీఈ-పోల్‌ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఓటరు తన ఓటు స్లిపును కూడా ఇదే వెబ్‌సైట్‌ నుంచి పొందే అవకాశం కల్పించారు.
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగుల సమాచారాన్ని మండల స్థాయి ఎన్నికల అధికారులు ఇదే వెబ్‌సైట్‌లో పొందుపరిచి ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకుంటారు. దీంతో ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగి మొబైల్‌ఫోన్‌కు సమాచారం పంపించి వారు పనిచేయాల్సిన ప్రాంతాన్ని సూచిస్తున్నారు. దీంతోపాటూ ఎన్నికలకు సంబంధించిన అన్ని నివేదికలనుృ వెబ్‌సైట్‌ ద్వారా అప్‌లోడ్‌ చేస్తారు. సమాచారం మండల స్థాయి నుంచి రాష్ట్రస్థాయికి నిమిషాల వ్యవధిలోనే చేరిపోతుంది. గ్రామపంచాయతీ ఎన్నికల్లో టెక్నాలజీని విస్తృతంగా వాడుతుండడంతో గతంలో కంటే పనులు సులభంగా సాగిపోతున్నాయి.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close