Telangana

 తెలంగాణ కాంగ్రెస్ కు నేతలు కావాలి

లోకల్ న్యూస్ హైద్రాబాద్ :1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగిందో తిరిగి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత అదే జరిగింది. 1994లో ఎన్టీరామారావు తెలుగుదేశం పార్టీ గెలుపొందిన తర్వాత తిరిగి రాష్ట్రంలో కోలుకోవడానికి దశాబ్దకాలం సమయం పట్టింది. ఇప్పుడు అదే రీతిలో 2014లో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ ను వెనక్కు నెట్టి తాను అధికారాన్ని చేజిక్కించుకున్నారు. మరోమారు నిన్న జరిగిన ఎన్నికల ఫలితాల్లోనూ కాంగ్రెస్ పార్టీ కుదేలయిపోయింది. నాడు 1994లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత అనంతరం జరిగిన 1999 ఎన్నికల్లోనూ చంద్రబాబునాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది.అయితే పదేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. పీసీసీ అధ్యక్షుడిగా, సీఎల్పీ నేతగా వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు తెచ్చారు. పదేళ్ల పాటు ఆయన నిత్యం ప్రజల్లో ఉండటం, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలను నిర్వహించారు. చరిష్మా కలిగిన నేతగా, అందరు నేతలను కలుపుకుని వెళుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రతిపక్ష నేతగా శాసనసభలో వైఎస్ వ్యవహరించిన తీరు, చేసిన ప్రసంగాలు సయితం అధికార తెలుగుదేశం పార్టీని ఇరకాటంలోకి నెట్టేశాయి. విద్యుత్తు సమస్యపై ఆయన దీక్షకు దిగడం, 2004 ఎన్నికలకు ముందు చేపట్టిన పాదయాత్ర ఆయనకు మంచి మైలేజీని తెచ్చిపెట్టాయి. రాష్ట్రంలో బలమైన నేతగా వైఎస్ ఎదగగలిగారు. ఆ తర్వాత 2009లో జరిగిన ఎన్నికల్లోనూ తాను ఐదేళ్ల కాలంలో ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ, ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకాలు వైఎస్ ను ప్రజలకు దగ్గరకు చేర్చి మరోసారి విజయాన్ని సాధించిపెట్టారు. అధిష్టానంతో సంబంధం లేకుండా సొంత కార్యక్రమాలతో ప్రజల చెంతకు వెళ్లడమే వైఎస్ విజయాలకు కారణంగాచెప్పాలి. మరి ఇప్పుడు తెలంగాణాలో నాటి 1994 పరిస్థితులు ఉన్నాయి. వైఎస్ లాంటి ఛరిష్మా ఉన్న నేత ఇప్పుడు కాంగ్రెస్ లో లేరనే చెప్పాలి. అటువంటి నేత కోసం కాంగ్రెస్ పార్టీ వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ కాంగ్రెస్ నేతలను రాజకీయంగా అధిష్టానమే ఎదగనివ్వలేదన్న ఒక ప్రచారమూ లేకపోలేదు. అందరూ ఆంధ్రప్రాంతానికి చెందిన నేతలే ఎక్కువగా సీఎంలు కావడంతో నాయకత్వ సమస్య తెలంగాణ కాంగ్రెస్ లో ఎక్కువగా ఉంది. ఉన్న కొద్ది మంది నేతల్లో సఖ్యత లేదు. సీనియర్ నేతలు ఉన్నా వాగ్దాటిలోనూ, ప్రజలను ఆకట్టుకోవడంలోనూ ఎవరూ పనికిరారన్నది చేదునిజం. తెలంగాణ మరో తమిళనాడులా కాకుండా ఉండాలంటే తెలంగాణ కాంగ్రెస్ కు వైఎస్ లాంటి బలమైన నేత అవసరమన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. లేకుంటే తెలంగాణలో జాతీయ పార్టీలకు ఇక కాలం చెల్లినట్లేనన్న కామెంట్స్ గట్టిగానే విన్పిస్తున్నాయి. మరి ఇప్పటికీ తెలంగాణలో బలమైన ఓటు బ్యాంకు ఉన్న కాంగ్రెస్ పార్టీని కాపాడేదెవరో? ఆ వైఎస్ ఎవరో? అన్నది కాలమే తేల్చాల్సి ఉంది.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close