National

 దిగొస్తున్న విజయ్ మాల్యా

లండన్, లోకల్ న్యూస్ :బ్యాంకుల రుణం ఎగవేత కేసులో విదేశాల్లో తలదాచుకున్న విజయ్ మాల్యా.. తాను అప్పుగా తీసుకున్న మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తానని తెలిపారు. అప్పుగా తీసుకున్న అసలు మొత్తం తిరిగి ఇచ్చేస్తా.. ప్లీజ్ తీసుకోండని ఆయన బ్యాంకులను కోరారు. మాల్యాను తమకు అప్పగించాలని యూకేను భారత్ కోరగా.. తనను అప్పగించొద్దంటూ మాల్యా యూకే కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానంతో త్వరలో తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో మల్యా చేసిన ట్వీట్లు ఆసక్తికరంగా మారాయి. వరుసగా ట్వీట్లు చేసిన మాల్యా.. తాను బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాన్ని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కోసం వెచ్చించానన్నారు. జెట్ ఇంధన ధరలు భారీగా పెరగడం, ఏటీఎఫ్ ధరలు ఎక్కువగా ఉండటంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఆయన తెలిపారు. కింగ్‌ఫిషర్ మంచి విమానయాన సంస్థ, కానీ ఎటీఎఫ్ ధరలతో ఇబ్బందిపడ్డాం. క్రూడ్ ఆయిల్ ధరలు కూడా బ్యారెల్ 140 డాలర్లకు చేరడంతో నష్టాలు అధికమయ్యాయి. దీంతో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను అటు మళ్లించాం అని మాల్యా తెలిపారు. నేను బ్యాంకుల డబ్బు ఎగొట్టి పారిపోయానని రాజకీయ నాయకులు, మీడియా పదే పదే ప్రచారం చేస్తున్నాయి. ఇదంతా అబద్ధపు ప్రచారం అని ఆయన తెలిపారు. ప్రజాధనాన్ని నేను నూటికి నూరు శాతం తిరిగి ఇచ్చేస్తాను. తీసుకోమని ప్రభుత్వాన్ని, బ్యాంకులను కోరుతున్నా అంటూ ఆయన ట్వీట్ చేశారు. అగస్టా వెస్ట్‌ల్యాండ్ వీవీఐపీ చాపర్ల ఒప్పందంలో క్రిస్టియన్ మైకెల్‌ను దుబాయ్ నుంచి భారత్ తీసుకొచ్చిన కొద్ది గంటల వ్యవధిలోనే మాల్యా ఈ ట్వీట్లు చేయడం గమనార్హం. విదేశాల నుంచి భారత్ వెనక్కి తీసుకొచ్చిన తొలి వ్యక్తి క్రిస్టియన్ మైకెల్. ఆర్థిక ఎగవేతదారులుగా ముద్రపడిన మాల్యా, నీరవ్ మోదీ, చోస్కీలను కూడా ఇలాగే వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close