National
మళ్లీ వేడెక్కిన కర్ణాటక రాజకీయాలు
బెంగళూర్, లోకల్ న్యూస్ :కర్ణాటక మళ్లీ హీటెక్కింది. ఒకవైపు సంకీర్ణ సర్కార్ శాసనసభ సమావేశాలకు సిద్ధమవుతుండగా, మరోవైపు అసంతృప్త ఎమ్మెల్యేలు పార్టీని వీడుతారన్న భయం ఆ రెండు పార్టీలను వెన్నాడుతోంది. ఇందుకు ప్రధాన కారణం తాజాగా జరుగుతున్న పరిస్థితులే. శాసనసభ సమావేశాలు వారంరోజుల్లో బెళగావిలో ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలలోపే 10 మంది ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు కమలం పార్టీ స్కెచ్ సిద్ధం చేసిందన్న ప్రచారంతో కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ నేతలు అప్రమత్తమయ్యారు. ఎమ్మెల్యేలు జారిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.దాదాపు పది మంది కాంగ్రెస్ శాసనసభ్యులు కమలంతో టచ్ లోకి వెళ్లినట్లు ఒక ఆడియో టేపు కలకలం రేపుతుంది. బళ్లారి కేంద్రంగా బీజేపీ నేత శ్రీరాములు, మాజీ మంత్రి గాలి జనార్థన్ రెడ్డిలు కమలం గూటికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రప్పించే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. వీటితో పాటు వరుసగా జరుగుతున్న సంఘటనలు కూడా కాంగ్రెస్ పార్టీని కలవరపెడుతున్నాయి. అలాగే కాంగ్రెస్ కు చెందిన చిక్ బల్లాపూర్ ఎమ్మెల్యే సుధాకర్ గాలి జనార్థన్ రెడ్డిని కలిసి చర్చలు జరపడం కూడా కమలం ఆపరేషన్ స్టార్టయిందన్న సంకేతాలు వెలువడుతున్నాయి.అయితే కమలం పార్టీలో టచ్ లోకి వచ్చిన
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మరికొద్ది రోజుల్లో జరగనున్న శాసనసభ సమావేశాలకు డుమ్మా కొట్టాలన్న వ్యూహరచనను కమలం పార్టీ చేసిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. అసంతృప్త ఎమ్మెల్యేలందరూ రిసార్ట్స్ కు తరలి వెళ్లే ఆలోచనలో కూడా ఉన్నట్ల తెలియడంతో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అందరితో ఫోన్ లో మాట్లాడుతున్నారు. ఈనెల 8వ తేదీన శాసనసభ పక్ష సమావేశానికి అందరూ రావాలని, సమస్యలుంటే అక్కడే పరిష్కరించుకుందామని సిద్దరామయ్య నచ్చచెప్పే ప్రయత్నాలు ప్రారంభించారు.కాంగ్రెస్ పార్టీ 25 మంది శాసనసభ్యులు అసంతృప్తితో ఉన్నట్లు ఇప్పటికే గుర్తించింది. వీరిని బుజ్జగించేందుకు కొందరు ఇప్పటికే రంగంలోకి దిగారు. బెళగావి జిల్లాకు చెందిన సతీష్ జార్ఘిహోళి ఇప్పటికే కొన్ని రిసార్ట్ లు సందర్శించి వచ్చారు. ఆయన కొంతమంది ఎమ్మెల్యేలతో పార్టీని
వీడుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో సిద్ధరామయ్యతో పాటు దేవెగౌడ, ముఖ్యమంత్రి కుమారస్వామిలు కూడా రంగంలోకి దిగారు. ఎప్పటికప్పుడు ఇంటలిజెన్స్ నివేదికలను తెపించుకుని కాంగ్రెస్ అగ్రనేతలను అప్రమత్తం చేస్తున్నారు. మొత్తం మీద కర్ణాటకలో ఎప్పుడు ఏమైనా జరగొచ్చన్న భావన జేడీఎస్, కాంగ్రెస్ నేతల్లో ఉత్కంఠ నెలకొంది.